Jana Sena chief Pawan Kalyan is taking the path of Loksatta founder Jayaprakash Narayan, which is a failed one.
రాజకీయాల్లోకి రావద్దని తెలుగు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అప్పట్లో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే, పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయనది ప్రధానంగా ఆదర్శవాదం. ఆ ఆదర్శవాదంతోనే జయప్రకాష్ నారాయణ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలను, సమాజాన్ని ప్రక్షాళన చేస్తాననే నమ్మకాన్ని చాలా వరకు కల్పించే ప్రయత్నం చేశారు. యువత ఆయనను చాలా వరకు అభిమానించింది కూడా. స్వచ్ఛ రాజకీయాలతో సమాజాన్ని కడిగి పారేస్తానని ఆయన భావించి ఉంటారని చెప్పవచ్చు. కానీ, చివరకు రాజకీయాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. స్వయంగా లోకసత్తాలోనే ఆయన రాజకీయాల మర్మాన్ని పసిగట్టి ఉంటారు. దాంతో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి ఉంటారు. అది ఆయన నిరాశతోనో నిస్పృహతోనో నిరాశావాదంతోనో చేశారని చెప్పడానికి వీలు లేదు. రాజకీయాల ద్వారా సమాజాన్ని ఏమో గానీ రాజకీయాలనే ప్రక్షాళన చేయలేమనే విషయం అనుభవపూర్వకంగా తెలిసి ఉంటుంది.
దాదాపుగా అటువంటి ఆదర్శవాదంతోనే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. కత్తిని కత్తితో కోయాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు లెదు. పవన్ కల్యాణ్‌కు కూడా రాజకీయాలకు సంబంధించిన అనుభవం లేదని అనలేం. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అనుభవం ఉండనే ఉంది.