Ganesh Idol Decorated with Currency Notes: గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువై ఉన్న లంబోధరుడిని స్థానిక వ్యాపారులు రెండు కోట్ల 35 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు. 20 ఏళ్ల క్రితం లక్ష రూపాయలతో ప్రారంభమైన అలంకరణ నేటికి 2 కోట్ల 35 లక్షలకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. 10, 20, 50, 100, 200, 500 నోట్లతో సుందరంగా అలంకరించారు. గణేష్ ఉత్సవాలలో వచ్చే శుక్రవారం రోజున పార్వతి తనయుడిని కరెన్సీ నోట్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు సంక బాలాజీ గుప్తా చెప్పారు. 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగినట్లు తెలిపారు. వ్యాపారులంతా కలిసి కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గణనాథుని సహకారంతో తమ వ్యాపారాలు మంచిగా జరుగుతున్నట్లు బాలాజీ గుప్తా వెల్లడించారు. మంగళగిరిలో కరెన్సీ నోట్లతో అలంకరించిన లంబోధరుడిని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.